మూసీ ఆక్రమణలపై హైడ్రా చూపు... అధికారులతో రంగనాథ్ సమీక్ష

  • నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే 
  • నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని సీఎం హామీ
  • సుమారు 1600 ఇళ్లను గుర్తించిన అధికారులు
మూసీ నది ఒడ్డున ఆక్రమణలను తొలగించి ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మూసీ సుందరీకరణ పనులలో భాగంగా ఆక్రమణ తొలగింపు బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మూసీ రివర్ బెడ్ లో గురువారం తెల్లవారుజాము నుంచే సర్వే చేపట్టారు. అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ చేస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ విషయంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో భేటీ అయ్యారు. 

ఆక్రమణల తొలగింపు, నిర్మాణాల కూల్చివేతతో నిర్వాసితులుగా మారబోయే కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మూసీ రివర్ బెడ్ లో సర్వే జరుపుతున్న అధికారులు నిర్వాసితులకు సాయం అందించేందుకు అవసరమైన వివరాలను కూడా సేకరిస్తున్నారు. 

నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పునరావాసం కల్పించడంతో పాటు అందించనున్న పరిహారం విషయంలో కలెక్టర్ల సమక్షంలోనే ప్రతీ కుటుంబానికి వివరాలను అందించేలా షెడ్యూలు రూపొందించారు. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్‌నగర్‌, పాతబస్తీలోని ఛాదర్‌ఘాట్, మూసానగర్‌, శంకర్‌నగర్‌లో హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు.

కూల్చబోయే నిర్మాణాలపై మార్క్ చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో మొత్తం 12 వేల ఆక్రమణలను గుర్తించినట్లు సమాచారం. వాటన్నింటినీ తొలగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిర్వాసితులకు చట్టప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా... ఇటీవల మత్రి పొన్నం ప్రభాకర్ కూడా పలుచోట్ల పర్యటించి అక్కడి నివాసితులతో మాట్లాడి భరోసా కల్పించారు.


More Telugu News