పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్ రౌత్ కు జైలు శిక్ష

  • పరువునష్టం కేసులో 15 రోజుల జైలు
  • రూ.25 వేల జరిమానా కూడా విధించిన మేజిస్ట్రేట్
  • రౌత్ పై కేసు పెట్టిన బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య
శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించింది. ఈమేరకు ఓ కేసులో గురువారం తీర్పు వెలువరించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్యలపై సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మీరా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో భారీ స్కాం జరిగిందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంలో కిరీట్ సోమయ్య దంపతులు రూ.100 కోట్ల స్కాం చేశారని విమర్శించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ డాక్టర్ మేధా కిరీట్ సోమయ్య.. సంజయ్ రౌత్ పై పరువునష్టం దావా వేశారు. ఈ దావాను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.. సంజయ్ రౌత్ నిరాధార ఆరోపణలు చేశారని నిర్ధారించారు. తప్పుడు ఆరోపణలు చేసి కిరీట్ సోమయ్య దంపతులకు పరువునష్టం కలిగించారని తేల్చి ఎంపీకి 15 రోజుల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు.


More Telugu News