తమిళనాడుకు కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

  • తమిళనాడులో డిస్‌ప్లే అసెంబ్లింగ్ యూనిట్‌ను ప్రారంభించాలని భావిస్తున్న ఫాక్స్‌కాన్
  • 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలు
  • ఈ క్రమంలో తమిళనాడుకు అభినందనలు తెలిపిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమిళనాడు రాష్ట్రానికి కంగ్రాట్స్ చెప్పారు. ఫాక్స్‌కాన్ సంస్థ తమిళనాడులో స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే మాడ్యూల్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వార్తను ట్వీట్ చేస్తూ... తమిళనాడు రాష్ట్రానికి అభినందనలు తెలిపారు.

ఫాక్స్‌కాన్ సంస్థ ఇందుకోసం 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. భారత్‌లో ఫాక్స్‌కాన్ నిర్మించే మొదటి డిస్‌ప్లే మాడ్యూల్ యూనిట్ ఇదే కానుంది. ఇది ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ ఉత్పత్తికి తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నారు. 

ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ యూనిట్ కూడా అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ డిస్‌ప్లే మాడ్యూల్స్ దిగుమతిని తగ్గించుకోవచ్చు. అప్పుడు ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి నల్గొండలో ఈ జిల్లా మంత్రుల అరాచకాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను నేతలకు వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీని ముందుకు నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.


More Telugu News