జూ.ఎన్టీఆర్ 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుపై స్పందించిన కేటీఆర్

  • సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ పాలన అని విమర్శ
  • బీఆర్ఎస్ హయాంలో ఏ పండుగ అయినా శాంతియుతంగా జరిగేలా చూశామని వ్యాఖ్య
  • ఫార్ములా వన్ వంటి ఈవెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించామన్న కేటీఆర్
ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుపై ఆయన స్పందించారు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గణేశ్ నిమజ్జనం, మొహర్రం ఊరేగింపు, బోనాల పండుగ... ఇలా ఏ పండుగ అయినా శాంతియుతంగా జరిగేలా చూశామన్నారు. ఫార్ములా వన్ వంటి ఈవెంట్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తమ మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించేవారన్నారు. మంత్రులతో పాటు పోలీసులు, అధికారులు, ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. సినిమా ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అన్నింటికీ ఇబ్బందులే కనిపిస్తున్నాయన్నారు. 

కానీ ఇప్ప‌టి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో మీరే చూడండి... నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకు సంబంధించి ఏదో రిలీజ్ ఫంక్షన్‌ను కూడా నిర్వహించలేని అసమర్థత కనిపించిందన్నారు. అలాంటి పరిస్థితిలోకి హైదరాబాద్ వెళ్లిందని వ్యాఖ్యానించారు.


More Telugu News