కొందరు తొందరపడుతున్నారు... అది మంచి పద్ధతి కాదు: సీఎం చంద్రబాబు

  • 99 నామినేటెడ్ పోస్టులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
  • 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
  • కొత్తగా నియమితులైన చైర్మన్లతో నేడు చంద్రబాబు సమావేశం
  • ఎలా నడుచుకోవాలో దిశానిర్దేశం
  • పార్టీ కోసం కష్టపడినవారికే పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం నిన్న 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించిన సంగతి తెలిసిందే. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కాగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారితో సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామని వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామని స్పష్టం చేశారు. 

"ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి... లిస్టులు ఉంటాయి. కొందరు నాయకులు తొందర పడుతున్నారు... ఇది మంచి పద్దతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంత వరకు అవకాశం ఇచ్చాం. 

కష్టపడిన వారికి మొదటి లిస్టులో ముందుగా అవకాశాలు ఇచ్చాం... మీకు అవకాశాలు వచ్చాయి అంటే... మిగిలిన వారు పనిచేయలేదు అని కాదు, అర్హత లేదు అని కాదు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పొయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. 

పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారు... ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నాం. కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించం. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం" అని చంద్రబాబు వివరించారు. 

ఇక, నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎలా నడుచుకోవాలన్నదానిపైనా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదని స్పష్టం చేశారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజా సేవకులం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 

"ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు.... మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు. మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలి. మీ విభాగాలపై ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విషయాలపై లోతుగా కసరత్తు చేయండి. 

పెట్టుబడులు రాబడట్టడంలో పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఎపీఐఐసీ పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే... గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి... కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడు.

ఆర్టిసీని నిలబెట్టాలి... ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి... కార్గో పెంచాలి. నేతలకే కాదు... ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చాం. బాగా పనిచేయండి... ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి... మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరు పనిచెయ్యాలి. 

సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని నేను, పవన్ కళ్యాణ్ గారు చెప్పాం. అందరూ అదే పాటించాలి. 15 రోజుల్లో వరద సాయం అందించాం... మళ్లీ బాధితులను నిలబెట్టే ప్రయత్నం చేశాం. ఇదీ మన విధానం... దీనికి అనుగుణంగా మీరు పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి, సమన్వయంతో మీరంతా పనిచేయాలని కోరుతున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి" అంటూ చంద్రబాబు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.


More Telugu News