బూజులు పట్టిన ఇంట్లో సావిత్రిగారిని చూశాను: నటి సులక్షణ

  • డాలీ పేరుతో బాలనటిగా పరిచయం  
  • హీరోయిన్ సులక్షణగా ఎంట్రీ 
  • పేరు తెచ్చిన సినిమాగా 'శుభోదయం'  
  • ఆ తరువాత హీరోయిన్ గా అనేక సినిమాలు
సులక్షణ .. సీనియర్ హీరోయిన్. 'డాలీ' పేరుతో బాలనటిగా 100కి పైగా సినిమాలు చేశారు. సులక్షణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సినిమా 'శుభోదయం'. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలలో ఆమె నటించారు. తెలుగులో చంద్రమోహన్ తో కలిసి ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. అలాంటి సులక్షణ ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె కెమెరా ముందుకు రాలేదు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె 'సావిత్రి' గురించి ప్రస్తావించారు.

"బాలనటిగా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి నటించాను. వాళ్లంతా నన్ను ఎంతో గారంగా చూసుకునేవారు. అందువలన నాకు ఎస్వీఆర్ . సావిత్రిగారి వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. సావిత్రి గారి చివరి రోజులలో ఆమెను చూడాలనిపించింది. ఆమెను చూడాలని ఉందని జెమినీ గణేశన్ గారిని అడిగాను. అడ్రెస్ కనుక్కుంటూ నేను సావిత్రి గారి ఇంటికి వెళ్లాను. అది ఒక పాత ఇల్లు .. బూజులు పట్టి ఉంది .. ఫ్యాన్ కూడా లేదు" అన్నారు. 

"సావిత్రిగారు మనలో లేరు .. ఆమె చాలా భారీ మనిషి .. అలాంటి ఆమె ఐదేళ్ల పాపలా ముడుచుకుపోయారు. ఆమె ఒళ్లంతా ట్యూబ్స్ పెట్టారు. చాలా నల్లగా అయిపోయారు. ఆమెను చూసుకోవడానికి అక్కడ ఒక మనిషి ఉన్నారు. ఆ స్థితిలో నేను సావిత్రిగారిని చూడలేకపోయాను. ఎంతోమందికి ఎన్నో దానధర్మాలు చేసిన ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను. తను చేసిన దానధర్మాలు వలన తప్పకుండా ఆమె స్వర్గానికే వెళతారు" అని చెప్పారు.   


More Telugu News