హజ్ వీసాలపై బిచ్చగాళ్లను పంపిస్తోందంటూ పాకిస్థాన్ పై సౌదీ అరేబియా ఫైర్

  • ముస్లింలకు పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతున్న మక్కా
  • పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో సౌదీ చేరుకుంటున్న బిచ్చగాళ్లు
  • చర్యలు తీసుకోవాలంటూ పాక్ ను హెచ్చరించిన సౌదీ ప్రభుత్వం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా పుణ్యక్షేత్రానికి వెళ్లిరావాలని కోరుకుంటారు. ప్రతి ఏటా హజ్ యాత్ర పేరిట ముస్లింలు మక్కా వెళుతుంటారు. అయితే, ఉమ్రా, హజ్ వీసాలతో పాకిస్థాన్ పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లను తమ దేశం పంపిస్తోందంటూ సౌదీ అరేబియా మండిపడుతోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 

ఉమ్రా, హజ్ వీసాలతో పాకిస్థానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. సౌదీలో భిక్షాటన చేస్తున్న అనేకమంది పాకిస్థానీ జాతీయులను పట్టుకున్న స్థానిక అధికారులు... వారిని పాకిస్థాన్ తిప్పి పంపారు. 

కాగా, సౌదీ అరేబియా ప్రభుత్వం హెచ్చరికలు చేసిన విషయాన్ని పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. దీనిపై పాకిస్థాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లను సౌదీ పంపడం వెనుక ఓ మాఫియా పనిచేస్తోందని ఆరోపించారు. 

ఈ బెగ్గర్ మాఫియా పాకిస్థాన్ పరువును నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆదేశించినట్టు తెలిపారు.


More Telugu News