వాళ్లకు ఏడేళ్లకు పైగా శిక్ష పడాలి... జగన్ కు ఎంత శిక్ష పడుతోందో తెలియదు: రఘురామ

  • జగన్ అరాచకాలపై అవిశ్రాంత పోరాటం చేశానన్న రఘురామ
  • పరిస్థితులు తనలో కసిని పెంచాయని వెల్లడి
  • తర్వాతి వికెట్ సునీల్ కుమార్ దేనని స్పష్టీకరణ
జగన్ అరాచకాలపై తాను 2021 నుంచి 2024 వరకు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పోరాడానని టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. జగన్ ఎలాంటివాడన్నది ఒకరోజు కాకపోయినా మరో రోజైనా ప్రజలు అర్థం చేసుకోగలరని తాను పోరాటం చేశానని వివరించారు. 

ఇవాళ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఓ చానల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రఘురామ హాజరయ్యారు. 

గతంలో సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి అనేలాగా పరిస్థితులు తనలో కసిని పెంచాయని రఘురామ పేర్కొన్నారు. తాను ఏనాడూ నిరుత్సాహానికి గురికాలేదని చెప్పారు. రెండు, మూడు హత్యాయత్నాలు కూడా జరిగాయని అన్నారు. 

"ఇప్పటికే పీఎస్సార్ ఆంజనేయులు ఇటీవల కాదంబరి కేసులో సస్పెండ్ అయ్యాడు కాబట్టి, అతడి వికెట్ పడిపోయినట్టే. తర్వాతి వికెట్ కచ్చితంగా సునీల్ కుమార్ దే. ఈ వ్యవహారంలో జగన్ పాత్ర ఏమిటన్నది కూడా తేటతెల్లం అవుతుంది. వీళ్ల ఫోన్ల నుంచి తాడేపల్లికి వెళ్లిన కాల్ వివరాలు ఈజీగా దొరికేస్తాయి. కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది కాబట్టి, ఇదేమంత కష్టం కాదు. 

జెత్వానీ కేసులో కూడా గూగుల్ టేకౌట్ ద్వారానే వీళ్లందరూ దొరికిపోయారు. ఈ టవర్ కి, ఆ టవర్ కి ఆ సమయంలో వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు తప్పకుండా దొరుకుతాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తాను లండన్ లో ఉన్నానంటూ జగన్ చెప్పిన సొల్లు కబుర్లు ఇప్పుడు కూడా చెబుతామంటే కుదరదు. నన్ను హింసిస్తుంటే అతను చూసినట్టుగా టెక్నాలజీ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. 

ఇదంతా చేసింది పోలీసులు కాబట్టి, వీళ్లకు ఏడేళ్లకు పైగా శిక్ష పడాలి... సూచనలు చేసింది అతడు (జగన్) కాబట్టి, అతడు పోలీస్ అధికారి కాదు కాబట్టి, అతడికి ఎంత శిక్ష పడుతుందో తెలియదు కానీ... శిక్ష అయితే పడాలి... పడుతుంది. 

నా వ్యవహారంలో తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్ ప్రభావతిని ఒత్తిడి చేశారు. సునీల్ కుమార్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పనేముంది? అతడు ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్టు అక్కడి వీడియో రికార్డులు ఉన్నాయి. అతడి విషయం ఆ తర్వాత రోజు దినపత్రికల్లో కూడా వచ్చింది. అతడు ఎక్కడ తప్పించుకుంటాడు? మెడికల్ రిపోర్టులు కూడా తారుమారు చేసినట్టు ఆధారాలన్నీ దొరికాయి" అని రఘురామ వివరించారు.


More Telugu News