వీళ్లిద్దరూ భౌతిక పాత్రధారులు... వేసేయండ్రా అని చెప్పింది అతను!: రఘురామ

  • గతంలో రఘురామను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు
  • చిత్రహింసలు పెట్టారంటూ ఇటీవల రఘురామ ఫిర్యాదు
  • మాజీ సీఐడీ అధికారి విజయ్ పాల్ పిటిషన్ కొట్టివేత
  • ఓ న్యూస్ చానల్ లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రఘురామ
గతంలో తనను కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేయడంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇటీవల గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు కీలక  పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.

కాగా, ఈ అంశంపై ఓ న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి వీడియో లింక్ ద్వారా రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"నన్ను చిత్రహింసలు పెట్టిన వ్యవహారంలో భౌతిక పాత్రధారులు సునీల్ కుమార్, విజయ్ పాల్. సీతారామాంజనేయులు కూడా ఒక రేంజిలో సూత్రధారి అని చెప్పవచ్చు. ఏంచేయాలో అన్ని సూచనలు ఇచ్చి వేసేయండ్రా అని చెప్పింది జగన్ మోహన్ రెడ్డి! 

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. నా పుట్టినరోజు నాడే నన్ను ఇబ్బందులకు గురిచేయాలని చూశారు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి ఏపీ నుంచి నాడు నాలుగైదు వాహనాల్లో బయల్దేరి వచ్చారు. నాడు ఎఫ్ఐఆర్ సిద్ధం కాకముందే వారు నన్ను అదుపులోకి తీసుకోవడానికి బయల్దేరారు. నన్ను అరెస్ట్ చేసిందాక కూడా కోర్టుకు వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ సమర్పించలేదు. ఇలా తప్పు మీద తప్పు చేశారు. ఇదంతా కూడా పైవ్యక్తి చెప్పిన ఆదేశాలతో చేశారు. 

డీజీపీ అయిపోదామని సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. ఎవరికివాళ్లు జగన్ మోహన్ రెడ్డి కోరిక తీర్చితే డీజీ పదవి ఇస్తారని లెక్కలు వేసుకున్నారు. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా చెప్పకుండా ఇదంతా చేశారు. సునీల్ నాయక్ అని బీహార్ నుంచి వచ్చిన అధికారి మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయాడు. 

అంతకుముందు, జగన్ నాపై లోక్ సభలో అనర్హత వేటు వేయించేందుకు విమానంలో పంపించాడు. అయినా వాళ్ల వల్ల కాలేదు. దాంతో, ఇతడ్ని మనం ఏమీ చేయలేం, ఇతడికి వేరే ఎక్కడ్నించో ఆశీస్సులు ఉన్నాయి అని భావించి అతడు రూటు మార్చి, డైరెక్ట్ గా వేసేద్దాం అని నిర్ణయించుకున్నాడు! నాపై జగన్ కు తప్ప ఇంకెవరికి కోపం ఉంటుంది? ఆ పెట్టిన కేసు ఏంటి? అతడు చేసిన తప్పులను ఎత్తిచూపాం... అందులో దేశ ద్రోహం ఏముంది?" అంటూ రఘురామ పేర్కొన్నారు.


More Telugu News