నటుడు విజయ్ సంచలన నిర్ణయం.. 27న సమావేశానికి వారికి నో ఎంట్రీ

  • 23న జరగాల్సిన టీవీకే తొలి రాష్ట్ర సదస్సు 27కు వాయిదా
  • మద్యం తాగి వచ్చే సభ్యులను సమావేశానికి అనుమతించకూడదని నిర్ణయం
  • క్యాడర్‌కు మార్గదర్శకాలు పంపిన టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన తమిళ అగ్రనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 27న పార్టీ పార్టీ తొలి రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌కు మద్యం తాగి వచ్చే సభ్యులను అనుమతించ కూడదని నిర్ణయించారు. అంతేకాదు, సమావేశానికి వచ్చే వారికి ఉండాల్సిన కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ మార్గదర్శకాలు జారీచేశారు.

సదస్సుకు హాజరయ్యే సభ్యులు మద్యం తాగివస్తే వారిని దూరంగా ఉంచుతామని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళా సభ్యులు, సానుభూతిపరుకు అవసరమైన రక్షణ కల్పించాలని కార్యకర్తలకు ఆనంద్ సూచించారు. అలాగే, కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వచ్చేవారు రోడ్డుపై ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, బైక్‌పై వచ్చేవారు స్టంట్స్ చేయవద్దని కోరారు.

సమావేశం సమయంలో విధులు నిర్వర్తించే వైద్య బృందం, ఫైర్, రెస్క్యూ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, ఈ నెల 23నే కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో దానిని వాయిదా వేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.


More Telugu News