క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న 'మహా' సర్కారు

  • బాంద్రాలో గ‌వాస్క‌ర్‌కు కేటాయించిన‌ 2వేల‌ చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లం స్వాధీనం
  • ఆ స్థ‌లం ముంబై రంజీ జ‌ట్టు సార‌థి అజింక్య ర‌హానేకు కేటాయింపు 
  • 1988లో లిటిల్ మాస్ట‌ర్‌కు ఈ ప్లాట్‌ను కేటాయించిన అప్ప‌టి మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వం 
  • 36 ఏళ్లుగా నిరూప‌యోగంగా ఉన్న స్థ‌లం
భార‌త క్రికెట్ దిగ్గ‌జం, లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గవాస్క‌ర్‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ముంబ‌యిలోని బాంద్రాలో ఇంత‌కుముందు ఆయ‌న‌కు కేటాయించిన‌ 2వేల‌ చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లాన్ని మ‌హారాష్ట్ర స‌ర్కార్ స్వాధీనం చేసుకుంది. ఆ స్థ‌లాన్ని ముంబ‌యి రంజీ జ‌ట్టు సార‌థి అజింక్య ర‌హానేకు కేటాయించింది. ఈ మేర‌కు ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వం సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. త‌న‌దైన ఆట తీరుతో దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన గ‌వాస్క‌ర్‌కు 1988లో అప్ప‌టి మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వం బాంద్రాలో 2వేల‌ చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థలాన్ని కేటాయించింది. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయ‌డంతో పాటు రాబోయే క్రికెట‌ర్ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం కోసం ఆ స్థ‌లాన్ని ఇస్తున్న‌ట్టు తెలిపింది.

కానీ, లిటిల్ మాస్ట‌ర్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ ఎలాంటి నిర్మాణం చేప‌ట్ట‌లేదు. ఆ స్థ‌లం అలాగే ఉండిపోయింది. దాదాపు 36 ఏళ్లుగా ఎలాంటి ఉప‌యోగం లేకుండా ప‌డి ఉంది. దాంతో ఆ స్థలాన్ని ఇప్పుడు స‌ర్కార్ స్వాధీనం చేసుకుంది. అనంత‌రం ఆ ప్లాట్‌ను అజింక్య‌ ర‌హానేకు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అక్క‌డ క్రికెట్ అకాడ‌మీ నిర్మాణం కోసం రహానేకు లీజుకు ఇస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

కాగా, అజింక్య ర‌హానే ఒక‌ప్పుడు టీమిండియాలో మూడు ఫార్మాట్‌ల‌లో కీల‌క ప్లేయ‌ర్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత టెస్టుల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అనంత‌రం ఈ ఫార్మాట్‌లో కూడా విఫ‌లం కావ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం దేశ‌వాళీ క్రికెట్ మాత్ర‌మే ఆడుతున్నాడు. ముంబ‌యి రంజీ జ‌ట్టు సార‌థిగా కొన‌సాగుతున్నాడు.


More Telugu News