రెండ్రోజుల్లో ఆ రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారన్న మంత్రి
  • రైతులను ఆదుకోవడానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న మంత్రి
  • రెండు రోజుల్లో తొలి విడతగా ఈ మొత్తం ఇస్తామన్న పొంగులేటి
వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని, వీటిని మరో రెండ్రోజుల్లో ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోయారన్నారు. పంట నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారని గుర్తు చేశారు. రైతులను ఆదుకోవడానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, వాటిని త్వరలో ఇస్తామన్నారు.

కేంద్ర బృందం పరిశీలించి వెళ్లిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదన్నారు. రైతులకు పంట నష్టపరిహారంగా మొదటి విడతలో రూ.10 వేలు ఇస్తామన్నారు. తాము రైతులను ఆదుకోవడానికి చూస్తున్నామని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో నాటి ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు.

అమృత్ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడగానే కూలగొట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలో స్మార్ట్ కార్డులు ఇస్తామని, అవి ఉంటేనే సన్నబియ్యం ఇస్తామన్నారు. ఖరీఫ్ పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.


More Telugu News