రామాయణంలోని సందర్భాన్ని ప్రస్తావించిన ఢిల్లీ సీఎం అతిశీపై బీజేపీ ఆగ్రహం

  • శ్రీరాముడితో కేజ్రీవాల్‌కు పోలికపై బీజేపీ ఎంపీ ఆగ్రహం
  • బెయిల్‌పై ఉన్న వ్యక్తిని రాముడితో పోలుస్తారా? అని ఆగ్రహం
  • ఖాళీ కుర్చీని వదిలేయడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించారని విమర్శ
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ రామాయణంలోని సందర్భాన్ని ప్రస్తావించిన అతిశీపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను దేవుడైన శ్రీరాముడితో పోలిక తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు.

అతిశీ ఈరోజు ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు. సీఎంగా కేజ్రీవాల్ ఉపయోగించిన ఛైర్ ను ఖాళీగా ఉంచి, వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అతిశీ మాట్లాడుతూ... ప్రస్తుతం తనకు రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను పాలించాల్సిన పరిస్థితుల్లో, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని ఏలాడని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు తన పక్కన ఉన్న కుర్చీ కేజ్రీవాల్‌ది అని, నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో గెలిచి ఆయన మళ్లీ అధికారాన్ని చేపడతారని జోస్యం చెప్పారు.

అయితే రామాయణంలోని సందర్భాన్ని ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ మండిపడ్డారు. బెయిల్ పైన ఉన్న అవినీతిపరుడిని ఎవరైనా రాముడితో పోలుస్తారా? రాముడు ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? అని మండిపడ్డారు. శ్రీరాముడు పురుషోత్తముడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హిందూ దేవుళ్లని కించపరచడానికి ఎప్పుడూ వెనుకాడలేదని, సనాతనధర్మాన్ని నిత్యం అవమానిస్తూనే ఉన్నారని విమర్శించారు.

ఖాళీ కుర్చీని వదిలేయడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించారన్నారు. రాజ్యాంగం.. సీఎంకు అధికారం ఇస్తుంది... దానిని అమలు చేయడమే వారి ప్రాథమిక బాధ్యత అన్నారు. కానీ అతిశీ మాత్రం బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లుగా ఉన్నారని విమర్శించారు. ఆ ఖాళీ కుర్చీపై ఆత్మ కూర్చుందేమోనని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని సీరియస్‌గా తీసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని అతిశీకి సూచించారు.


More Telugu News