రాముడు వనవాసానికి వెళితే భరతుడిలా బాధ్యతలు చేపట్టా: ఢిల్లీ సీఎం అతిశీ

  • ఆ కుర్చీ ఎప్పటికైనా కేజ్రీవాల్ దే అంటూ మాజీ సీఎం కుర్చీని పక్కనే పెట్టుకున్న అతిశీ
  • బాధ్యతలు స్వీకరించాక మీడియాతో మాట్లాడిన అతిశీ
  • ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు మరోసారి పట్టం కడతారన్న కొత్త సీఎం
రామాయణంలో రాజ్యాన్ని వదిలిపెట్టి రాముడు వనవాసానికి వెళితే ఆయన పాదుకలకు పట్టం కట్టి పాలించిన భరతుడిలా ఢిల్లీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టానని సీఎం అతిశీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతిశీ.. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై తనకున్న భక్తిని చాటుకున్నారు. గతంలో కేజ్రీవాల్ ఉపయోగించిన కుర్చీని పక్కన పెట్టుకుని తాను మరో కుర్చీలో ఆసీనులయ్యారు. ఆ కుర్చీ ఎప్పటికైనా కేజ్రీవాల్ దేనని చెప్పారు.

నాలుగు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోమారు కేజ్రీవాల్ కు పట్టం కడతారని, ఈ కుర్చీలో మరోమారు ఆయనను కూర్చోబెడతారని తనకు విశ్వాసం ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో భరతుడితో తనను తాను పోల్చుకున్నారు. రాముడు వనవాసం వెళితే ఆయన తరఫున ప్రతినిధిగా పాలనా బాధ్యతలను భరతుడు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం తాను కూడా అదేవిధంగా బాధ్యతలు చేపట్టానని వివరించారు. నాలుగు నెలల తర్వాత కేజ్రీవాల్ తిరిగి ఇక్కడికి (సీఎంవోకు) వస్తారని, అప్పటి వరకు పాలన కుంటుపడకుండా తాను చూసుకుంటానని అతిశీ చెప్పుకొచ్చారు.


More Telugu News