ఆరేళ్ల వయసులో అపహరణ.. 76 ఏళ్ల వయసులో తిరిగి కుటుంబాన్ని కలిసిన అమెరికన్

  • పార్క్ లో ఆడుకుంటుంటే ఎత్తుకెళ్లిన మహిళ
  • రాష్ట్రాలు దాటించి సొంత కొడుకులా పెంచుకున్న వైనం
  • తప్పిపోయిన అంకుల్ కోసం పట్టుబట్టి వెతికిన కోడలు
సోదరుడితో కలిసి పార్క్ లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిని ఓ మహిళ చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లింది. చేతిలో రెండు చాక్లెట్లు పెట్టి విమానం ఎక్కించింది. అంతే.. ఆ తర్వాత తల్లిదండ్రులు గుర్తురాకుండా సొంత కొడుకులా పెంచుకుంది. అయితే, ఆ బాలుడి కోసం అమ్మా నాన్న చాలా వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, పేపర్ లో ప్రకటన ఇచ్చి వెతికించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాలుడి గురించి అంతా మరిచిపోయారు.

తమ ఫ్యామిలీ ఫొటోలో ఆ బాలుడి ఫొటో చూసి విషయం అడిగి తెలుసుకున్న అతని మేనకోడలు మాత్రం చిన్నప్పుడు తప్పిపోయిన తన అంకుల్ ను ఎలాగైనా తిరిగి కలుసుకోవాలని నిర్ణయించుకుంది. టెక్నాలజీ సాయంతో అతికష్టమ్మీద వెతికి పట్టుకుంది. తన పిల్లల సాయంతో వెళ్లి అంకుల్ ను కలుసుకుంది. అమెరికాలోని ఓక్లాండ్ లో చోటుచేసుకుందీ ఘటన.

ఓక్లాండ్ కు చెందిన లూయిస్ అర్మాండో అల్బినో ఆరేళ్ల వయసులో 1951 లో కిడ్నాప్ కు గురయ్యాడు. స్థానిక పార్క్ లో ఆడుకుంటుంటే ఓ మహిళ అతడిని తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె, ఆమె భర్తే లూయిస్ కు తల్లిదండ్రులుగా మారారు. లూయిస్ వారి దగ్గరే పెరిగిపెద్దయ్యాడు. తన సొంత కుటుంబ సభ్యుల గురించి మర్చిపోయాడు. ఇటు లూయిస్ తల్లిదండ్రులు కొడుకు కోసం చాలాకాలం వెతికారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో గుండెల నిండా బాధతోనే ఎక్కడో ఓ చోట తన కొడుకు ప్రాణాలతో ఉండి ఉంటాడని లూయిస్ తల్లి సరిపెట్టుకుంది. 2005 లో ఆమె చనిపోయింది.  

లూయిస్ మేనకోడలు ఈ మిస్టరీని తేల్చాలని నడుంబిగించింది. లూయిస్ సోదరుడు ద్వారా కిడ్నాప్ జరిగిన తీరును తెలుసుకుంది. కిడ్నాప్ చేసిన మహిళ ఆనవాళ్లతో ఆన్ లైన్ లో వెతకడం మొదలుపెట్టింది. తన అంకుల్ పోలికలున్న చాలామందితో డీఎన్ఏ టెస్టు చేయించుకుంది. చివరకు లూయిస్ ఆచూకీ గుర్తించింది. డీఎన్ఏ టెస్టులో తమది రక్త సంబంధం అని తేలడంతో తన తల్లితో కలిసి లూయిస్ ఇంటికి వెళ్లింది. 1951లో కుటుంబం నుంచి విడిపోయిన లూయిస్.. ఎట్టకేలకు 2024లో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.


More Telugu News