తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • రుతుపవనాల తిరోగమనంలో భారీ వర్షాలు
  • ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కొన్ని జిల్లాల్లో వర్షాలు
  • బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు
  • పిడుగుపాటుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మహిళల మృతి
నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో  నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడగా, మయన్మార్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో రెండో ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అక్కడి సమీపంలోని అండర్‌పాస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు చిక్కుకుపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.


More Telugu News