వైసీపీలో గత నాలుగేళ్లు నా పరిస్థితి పూర్తిగా దిగజారింది.. అందుకే టీడీపీలోకి: మోపిదేవి

  • విజయవాడలో మత్స్యకార నేతలతో ఆత్మీయ సమావేశం
  • గత నాలుగేళ్లు వైసీపీలో చీకట్లో మగ్గిపోయానన్న మోపిదేవి
  • నలుగురికి సీట్లు ఇప్పించే స్థాయి నుంచి తనకే సీటు తెచ్చుకోలేని పరిస్థితికి దిగజారిపోయానని ఆవేదన
  • జగన్‌తో గ్యాప్ వచ్చాక ఇంకా పార్టీలో కొనసాగడం భావ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నానన్న నేత
బాధ్యతగా రాజకీయాలు చేసిన తాను గత నాలుగేళ్లు చీకట్లో మగ్గిపోయానని రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార సామాజిక వర్గ నేతలతో నిన్న విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మోపిదేవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గత నాలుగేళ్లు తన స్థాయి పూర్తిగా దిగజారిందని, నలుగురికి సీట్లు ఇప్పించే స్థితి నుంచి గత ఎన్నికల్లో తనకే సీటు తెచ్చుకోలేని స్థితికి తన పరిస్థితి దిగజారిందని వాపోయారు.

ప్రతిపక్షంలో ఉన్నామేమో అనిపించేది
పార్టీ మారే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తానెప్పుడూ అనుకోలేదని మోపిదేవి పేర్కొన్నారు. జగన్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో అందరికీ తెలుసని, కొన్నిసార్లు తాము అధికారంలో ఉన్నామా? లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా? అని సందేహం వచ్చేదని, ఇదే విషయాన్ని పలుమార్లు తనను తానే ప్రశ్నించుకున్నట్టు చెప్పారు. తానెప్పుడూ ఎవరితోనూ వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోనప్పటికీ గత ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని వాపోయారు. 

రాజకీయాల నుంచి వైదొలగడం కరెక్ట్ కాదనే..
జగన్‌తో గ్యాప్ పెరిగాక ఆయన నాయకత్వంలో పనిచేయడం సరికాదని, ఎన్నికలకు ముందే పార్టీ మారదామని అనుకున్నా, పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుందని ఆగానని చెప్పారు. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాక రాజకీయాల నుంచి తప్పుకోవడం సరికాదనే టీడీపీలో చేరుతానని చెప్పానని, నా నిర్ణయం ఏంటో మీకు చెప్పాలనే ఈ సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. 

అమరావతిలో ఎకరం స్థలంలో మత్స్యకార భవనం
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మత్స్యకారుల పిల్లల కోసం గురుకులాలు, 55 ఏళ్లకే వారికి పింఛన్ ఇప్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. అమరావతిలో ఎకరం స్థలంలో మత్స్యకార భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.



More Telugu News