గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన చిరంజీవికి లోకేశ్‌, కేటీఆర్ విషెస్

  • 150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు చిరుకు అరుదైన గౌర‌వం
  • ఈ నేప‌థ్యంలో చిరంజీవికి సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు
  • చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే అంటూ లోకేశ్ ట్వీట్ 
  • అరంగేట్రం నుండి ఆధిపత్యం వరకు అంటూ కేటీఆర్ పోస్ట్‌
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు ఆయ‌న‌కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో చిరుకు సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిరంజీవికి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా విషెస్ తెలియ‌జేశారు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే అంటూ లోకేశ్ ట్వీట్ చేయ‌గా.. అరంగేట్రం నుండి ఆధిపత్యం వరకు చిరంజీవికి ఇది ఎంతో అపురూప‌మైన ప్ర‌యాణమ‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

"గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే. 156 సినిమాల్లో నటించి 537 పాటలకు డ్యాన్స్ చేసి మొత్తం 24 వేల స్టెప్పులేసి ప్రేక్షకులతో స్టెప్పులేయించారు చిరంజీవి గారు. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు వారికి గర్వకారణం" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

"అరంగేట్రం నుండి ఆధిపత్యం వరకు చిరంజీవికి ఇది ఎంతో అపురూపమైన ప్రయాణం! 1978లో ఇదే రోజున చిరంజీవి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు 46 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఆయన అసమానమైన ప్ర‌తిభ‌ను భారతీయ సినిమాలో అత్యంత విజ‌య‌వంతమైన స్టార్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో జరుపుకుంటోంది! 

156 సినిమాలు, 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూవ్‌లు. అలాగే లెక్కలేనన్ని జ్ఞాపకాలతో మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. తరతరాలను మంత్రముగ్ధులను చేస్తూ, సినిమా కళను నిర్వచించినందుకు తెలుగు సినిమా గర్వించదగిన వ్యక్తికి అభినందనలు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


More Telugu News