న్యూయార్క్ లో మోదీ సభ... భద్రత కట్టుదిట్టం

  • అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • నేడు న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో సమావేశం
  • అతివాద గ్రూపులతో ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
ప్రధాని నరేంద్ర మోదీ  మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో మోదీ పర్యటనకు ప్రవాస భారతీయుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా, ఆదివారం నాడు న్యూయార్క్ లో మోదీ సభ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ న్యూయార్క్ లోని యూనియన్ డేల్ లో నసావు కొలీజియంలో ప్రసంగించనున్నారు. 

మోదీ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఇండోర్ ఆడిటోరియం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అమెరికా కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ బలగాలు పూర్తి స్థాయిలో మోదీకి భద్రత కల్పిస్తున్నాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులందరినీ క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను మోహరించారు. 

నసావు ఆడిటోరియం లోపలికి దారి తీసే మార్గాలను నసావు కౌంటీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పలుచోట్ల జాగిలాలతో కూడిన బాంబు స్క్వాడ్ లు కూడా దర్శనమిచ్చాయి. 

అతివాద గ్రూపుల నుంచి ముప్పు ఉండే అవకాశాలున్న నేపథ్యంలో, ఈ మేరకు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిక్కు, ఇస్లామిక్, ఇతర రాజకీయ సంస్థలు మోదీ కార్యక్రమం వద్ద నిరసనలు తెలుపుతాయన్న ప్రకటనల నేపథ్యంలో, ఆ దిశగానూ చర్యలు తీసుకున్నారు. నిరసనకారులను నసావు కొలీజియంకు చాలా దూరంలోనే అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు.


More Telugu News