ఫేమస్ అవడం కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి: వీసీ సజ్జనార్

ఇటీవల కాలంలో రీల్స్ పిచ్చితో చాలామంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లడం, రోడ్లపై పడుకోవడం, పాములతో ఆడుకోవడం... ఇలాంటి చర్యలతో ఎంతో రిస్క్ తీసుకుంటున్నారు. 

ఈ ట్రెండ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పంచుకున్నారు. తన బిడ్డను ఒక చేత్తో పట్టుకుని బావి అంచున కూర్చున్న మహిళ ఓ హిందీ పాటకు అభినయిస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఏ మాత్రం పట్టు తప్పినా ఆమె బావిలో పడిపోతుంది... ఆమె ఏ మాత్రం పట్టు సడలించినా ఆ చిన్నారి బావిలో పడిపోవడం ఖాయం అని ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. 

దీనిపై సజ్జనార్ స్పందిస్తూ... ఇదెక్కడి పిచ్చి... సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలా పిల్లవాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస జ్ఞానం కూడా లేదు అని విమర్శించారు. 

సోషల్ మీడియాకు బానిసలు కాకండి... ఫేమస్ అవడం కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అని సజ్జనార్ హితవు పలికారు.


More Telugu News