సంచలన బౌలింగ్‌తో షేన్ వార్న్ రికార్డును సమం చేసిన అశ్విన్

  • 37వ సారి 5 వికెట్లు తీసిన భారత స్పిన్ దిగ్గజం
  • ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్‌తో సమంగా నిలిచిన అశ్విన్
  • చెన్నై టెస్టులో 6 వికెట్లతో రాణింపు
చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అశ్విన్ తన కెరీర్‌లో మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. 

బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో 37వ సారి 5 వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, మాజీ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును సమం చేశాడు. వార్న్ కూడా తన టెస్ట్ కెరీర్‌లో 37 సార్లు 5 వికెట్లు తీశాడు. అయితే వార్న్ కంటే 81 ఇన్నింగ్స్ ల ముందుగానే అశ్విన్ ఈ ఘనతను సాధించడం విశేషం.

కాగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ శ్రీలంక మాజీ దిగ్గజం తన కెరీర్‌లో ఏకంగా 67 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 230 ఇన్నింగ్స్‌ లు ఆడి ఈ రికార్డును నెలకొల్పాడు. 

టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లు వీళ్లే
1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 67 సార్లు ( 230 ఇన్నింగ్స్‌)
2. అశ్విన్ (భారత్) - 37 సార్లు (191 ఇన్నింగ్స్‌)
3. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 37 సార్లు (273 ఇన్నింగ్స్‌)
4. సర్ రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) - 36 సార్లు (150 ఇన్నింగ్స్‌)
5. అనిల్ కుంబ్లే (భారత్) - 35 సార్లు (236 ఇన్నింగ్స్‌).

మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్‌ను అశ్విన్ అధిగమించాడు. వాల్ష్ 519 వికెట్లు పడగొట్టగా... అశ్విన్ ప్రస్తుతం 522 వికెట్లు తీసి ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. 

ఇదిలావుంచితే.. సొంత మైదానంలో అశ్విన్ అద్భుత బౌలింగ్‌ ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ లక్ష్య ఛేదనలో 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.  దీంతో భారత్ ఏకంగా 280 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్‌ అందుకున్నాడు.


More Telugu News