ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

  • నంబూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్షకు శ్రీకారం
  • 11 రోజుల పాటు కొనసాగనున్న దీక్ష
  • అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్
శ్రీవారి ప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

దీక్ష చేపట్టిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పారు. ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను అపవిత్రం చేశారని, రథాలను తగలబెట్టారని ఆరోపించారు. రాముడి విగ్రహం తల తొలగిస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామన్నారు.

పూజా విధానాలనే మార్చేశారు..
వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి పూజా విధానాలనే మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి తిరుమలలో నాటి ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని ఆరోపించారు. శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు.

దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంత అపవిత్రం చేసినా మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. వేదన కలిగినప్పుడు పోరాడతామని, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంపై క్యాబినెట్‌ భేటీ, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసినవారిని జగన్‌ ఎలా సమర్థిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.







More Telugu News