సింగర్ మనో కుమారులకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్

  • పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో దాడి ఆరోపణలతో కేసు
  • వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో నెల రోజులు సంతకం చేసి రావాలని షరతు
  • మద్యం మత్తులో శ్రీదేవి కుప్పంలో ఇద్దరితో గొడవ
ఓ దాడికి సంబంధించిన కేసులో ప్రముఖ తమిళ గాయకుడు మనో ఇద్దరు కుమారులకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో గాయకుడు మనో కుమారులు షాకీర్, రఫీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో వారు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నెల రోజుల పాటు ప్రతిరోజూ వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి రావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనో కుమారులు మద్యం మత్తులో శ్రీదేవి కుప్పంలోని ఓ తినుబండారం వద్ద కిరుపాకరన్ అనే విద్యార్థితోనూ, 16 ఏళ్ల బాలుడితోనూ గొడవపడ్డారు. ఈ ఘటనలో మనో డ్రైవర్ ధర్మన్, ఇంటి పనిమనిషి విఘ్నేశ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. షాకీర్, రఫీ మాత్రం పరారయ్యారు.

ఈ ఘటనపై మనో భార్య జమీలా మాట్లాడుతూ... తన కొడుకులను కొంతమంది యువకులు చుట్టుముట్టి దాడి చేశారని మీడియా ముఖంగా ఆరోపించారు. శ్రీదేవి కుప్పంలోని తినుబండారాల దుకాణం వద్ద కూడా తన కుమారులపై దాడి జరిగిందన్నారు. తమ ఇంట్లోకి కూడా చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని వివరించారు.


More Telugu News