నా స్టయిల్లో నేను చేస్తాను అన్నాడు... నాక్కూడా అదే కావాలని చెప్పాను: రజనీకాంత్

  • రజనీకాంత్ ప్రధానపాత్రలో వేట్టయాన్
  • అక్టోబరు 10న గ్రాండ్ రిలీజ్
  • నిన్న చెన్నైలో ఆడియో వేడుక
సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. కె.ఇ.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం నాడు ఈ సినిమా ఆడియో వేడుక‌ చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రజనీకాంత్ మాట్లాడారు. 

"సాధార‌ణంగా ఒక సినిమా హిట్ త‌ర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌లో ఓ టెన్ష‌న్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాల‌ని అనుకుంటారు. హిట్ త‌ర్వాత కూడా మరో హిట్ మూవీ ఇవ్వాల‌నే టెన్ష‌న్ అంద‌రికీ ఉంటుంది. సాధార‌ణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. అన్నీ అలా కుద‌రాలి. 

జైల‌ర్ మూవీ హిట్ త‌ర్వాత నేను క‌థ‌లు విని, కొన్నాళ్లకు క‌థలు పెద్ద‌గా విన‌టం మానేశాను. ఆ స‌మ‌యంలో మా అమ్మాయి సౌంద‌ర్య, డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్‌ను క‌లిసింది. అప్ప‌టికే నేను జై భీమ్ సినిమాను చూసి ఉన్నాను. సాధార‌ణంగా మంచి సినిమాల‌ను చూసిన‌ప్పుడు స‌ద‌రు ద‌ర్శ‌కుల‌కు ఫోన్ చేసి మాట్లాడ‌టం నాకు అల‌వాటు. కానీ ఎందుక‌నో జ్ఞాన‌వేల్‌తో నేను మాట్లాడ‌లేదు. 

ఆ స‌మ‌యంలో సౌంద‌ర్య నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి జ్ఞాన‌వేల్ ద‌గ్గ‌ర మంచి లైన్ ఉంద‌ని, విన‌మ‌ని నాతో చెప్పింది. అప్పుడే నాకు, జ్ఞాన‌వేల్ డైరెక్ట‌ర్ కావటానికంటే ముందు ఓ జ‌ర్న‌లిస్ట్ అని తెలిసింది. మ‌రోసారి జైభీమ్ సినిమా చూశాను. ఎవ‌రి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయ‌ని వ్య‌క్తి, జై భీమ్‌ను ఎంత గొప్ప‌గా ఎలా తీశాడా అని ఆలోచించాను. 

త‌ర్వాత జ్ఞాన‌వేల్‌తో ఫోన్లో మాట్లాడి క‌లిశాను. మీరు సందేశాత్మ‌క సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. త‌ర్వాత త‌ను చెప్పిన కథ విన్నాను... నాకు న‌చ్చింది. దాన్ని డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పాను. 

ప‌ది రోజుల స‌మ‌యం అడిగిన డైరెక్ట‌ర్‌... రెండు రోజుల్లో మ‌ళ్లీ ఫోన్ చేసి నేను లోకేశ్ కనగరాజ్, నెల్స‌న్ స్టైల్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌లేను... నా స్టైల్లో నేను చేస్తాన‌ని అన్నారు. నాకు కూడా అదే కావాల‌ని నేను అన‌టంతో ఆయ‌న క‌థ‌ను త‌యారు చేశారు. త‌ర్వాత సుభాస్క‌ర‌న్‌ను క‌లిసి క‌థ చెప్పగా, ఆయ‌న‌కు న‌చ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అంటే నా సొంత బ్యాన‌ర్‌లాంటిది. మీకు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా చేద్దాం సార్ అన్నారు సుభాస్క‌ర‌న్‌. మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స్ సినిమాలో యాడ్ అయ్యారు. 

అమితాబ్ పాత్ర గురించి జ్ఞాన‌వేల్ చెప్పి, ఆయ‌నే చేయాల‌ని చెప్ప‌గా, నిర్మాత‌లతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. డైరెక్ట‌ర్‌గారు సుభాస్క‌ర‌న్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయ‌న టీమ్‌లో భాగ‌మ‌య్యారు. ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో న‌టింటానికి ఒప్పుకున్నార‌ని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. 

ఎందుకంటే వృత్తిప‌రంగానే కాదు, ప‌ర్స‌న‌ల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చిన వ్య‌క్తి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ పిల్ల‌ల‌కు అమితాబ్‌గారు ఎంత పెద్ద న‌టుడో తెలియ‌దు. నేను ఆయ‌న్ని ద‌గ్గ‌ర నుంచి చూశాను. 

ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఆ పాత్ర‌ను త‌నెలా చేస్తాడోన‌ని అనుకున్నాను. త‌ను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈ త‌రంలో త‌న‌లాంటి న‌టుడ్ని నేను చూడ‌లేదు. 

రామానాయుడుగారి మ‌న‌వ‌డిగా రానా నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. బ‌య‌ట‌కు నార్మ‌ల్‌గా మాట్లాడుతూ క‌నిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్ట‌ర్‌గా ఆయ‌న మారిపోతారు. త‌ను చాలా మంచి యాక్ట‌ర్‌. బాహుబ‌లి స‌హా ఎన్నో సినిమాల్లో మెప్పించిన న‌టుడు. 

అనిరుధ్ (మ్యూజిక్ డైరెక్టర్) గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నా బిడ్డ‌లాంటివాడు. జ్ఞాన‌వేల్ చాలా మంచి వ్య‌క్తి. త‌న కోసం ఈ సినిమా హిట్ కావాల‌ని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని, జ్ఞాన‌వేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను" అని అన్నారు.


More Telugu News