చెన్నై పిచ్ పై అశ్విన్ హవా... భారీ లక్ష్యం ముంగిట బంగ్లా ఎదురీత

  • చెన్నై టెస్టులో గెలుపు దిశగా టీమిండియా
  • బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ లక్ష్యం
  • మూడో రోజు ఆట చివరికి 4 వికెట్లకు 158 పరుగులు చేసిన బంగ్లా
  • మరో రెండ్రోజుల ఆట మిగిలున్న వైనం
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 515 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు చేజార్చుకుని 158 పరుగులు చేసింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతగడ్డపై విజృంభించాడు. చివరి సెషన్ లో 3 కీలకమైన వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను దెబ్బకొట్టాడు. 

ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం (35), మొమినుల్ హక్ (13), ముష్ఫికర్ రహీమ్ (13) వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. 33 పరుగులు చేసిన ఓపెనర్ జకీర్ హుస్సేన్ ను బుమ్రా అవుట్ చేశాడు. 

ఈ నేపథ్యంలో, చెన్నై టెస్టులో ఓటమి తప్పించుకోవడం బంగ్లాదేశ్ కు అయ్యే పని కాదు. ఆ జట్టు ఇంకా 357 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు మరో రెండ్రోజుల సమయం మిగిలున్నప్పటికీ, ఫామ్ లో ఉన్న టీమిండియా బౌలర్లను ఎదుర్కొని బంగ్లాదేశ్ బ్యాటర్లు క్రీజులో అంత సమయం పాటు నిలవడం కష్టసాధ్యం. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసింది. అనంతరం, బంగ్లాదేశ్ ను 149 పరుగులకే కుప్పకూల్చి కీలకమైన 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. 

ఇక, రెండో ఇన్నింగ్స్ ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేయడం హైలైట్ గా నిలవగా... రెండో ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు బాదడం విశేషం.


More Telugu News