సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు అప్పగించారు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు అప్పగించారు: కేటీఆర్
  • అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారన్న కేటీఆర్
  • సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపణ
  • రూ.2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ.1000 విలువైన పనులు చేస్తుందా? అని నిలదీత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది కంపెనీకి పనులు అప్పగించారన్నారు. రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ రూ.1,000 కోట్ల పనులు చేస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ టెండర్ల అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు.


More Telugu News