బంగ్లాదేశ్‌పై తడబడుతున్న కోహ్లీ... ఎలా ఆడాలో రవిశాస్త్రి సలహా

  • బంగ్లాదేశ్‌పై తొలి రెండు ఇన్నింగ్స్‌లో తడబడిన కోహ్లీ
  • తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుట్
  • పిచ్‌పై కాలు కదపడంలో సందేహించవద్దని రవిశాస్త్రి సలహా
బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ తడబడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. 

స్పిన్నర్ల బౌలింగ్‌లో కాళ్లు కదిపేందుకు, ఏరియల్ షాట్లు ఆడేందుకు భయపడొద్దని సూచించాడు. క్రీజులో మంచి రిథమ్‌తోనే ఉన్నట్టు కనిపించిన విరాట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తన అవుట్‌పై డీఆర్ఎస్‌కు వెళ్లకుండానే పెవిలియన్ చేరాడు. అయితే, బంతి ప్యాడ్లను తాకడానికి ముందు బ్యాట్‌ను తాకినట్టు రీప్లేలో కనిపించింది. 

కోహ్లీ రెండుమూడేళ్లుగా స్పిన్నర్లకు దొరికిపోతున్నాడని శాస్త్రి పేర్కొన్నాడు. అయినప్పటికీ చాలానే పరుగులు చేశాడని గుర్తు చేసుకున్నాడు. పిచ్‌పై సమయానుకూలంగా కదలాలని, ఈ విషయంలో భయపడకూడదని చెప్పాడు. స్పిన్నర్లను కుదురుకోకుండా చేయాలని సూచించాడు. పిచ్‌పైకి వచ్చి ఏరియల్ షాట్లు ఆడాలని పేర్కొన్నాడు. 

ఇండియాలో కొన్ని పిచ్ లపై పరుగులు సాధించడం అనుకున్నంత సులభం కాదని, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ లెగ్ సైడ్ వైడ్ బంతికి క్యాచ్ ఇచ్చి ఫన్నీగా అవుటయ్యాడని గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి బంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొని ఏది పనిచేస్తుందనుకుంటే దానినే పాటించాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

2021 నుంచి కోహ్లీ ఇప్పటి వరకు ఆసియాలో 14 టెస్టుల్లో 23 ఇన్నింగ్స్‌లు ఆడి 29.72 సగటుతో 654 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలున్నాయి. ఈ కాలంలో కోహ్లీ టెస్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.


More Telugu News