అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ఏఎన్నార్ శత జయంతి వేడుకలు... మెగాస్టార్‌కి అవార్డు ప్రకటన

  • శత జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు పోస్టల్ స్టాంప్ విడుదల
  • 600 వందల మంది అభిమానులకు దుస్తులు బహుకరణ
  • అక్టోబర్ 28న మెగాస్టార్ చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డ్
  • 31 సిటీల్లో ఏఎన్ఆర్-100 ఫిల్మ్ ఫెస్టివల్‌ సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్న నాగార్జున
నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఎన్ఎఫ్‌డీసీ-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్నార్ ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. 

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955)  'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ఏఎన్నార్ ల్యాండ్‌మార్క్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4కేలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీతో ఈ క్లాసిక్స్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. 

ఇక ఇవాళ (శుక్రవారం) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్‌కి తరలివచ్చి అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు.. అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు దుస్తులు బహుకరించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కినేని నాగార్జున మాట్లాడారు. ‘‘నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. శివేంద్ర గారికి థ్యాంక్స్. దేవదాస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్లు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆడియెన్స్‌కి వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.

ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డు చిరంజీవికి...

‘‘పోస్టుమాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థ్యాంక్స్. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థ్యాంక్యూ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకున్నారు. ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. దీనికంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ ఆ అవార్డ్‌ను చిరంజీవి గారికి ప్రదానం చేస్తారు. అక్టోబర్ 28న ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు'’ అని నాగార్జున వెల్లడించారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ... అక్కినేని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన అక్కినేని కుటుంబం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి అక్కినేని గారి అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాగేశ్వరరావు గారు గొప్ప అంకితభావం ఉన్న నటులు. వారి బ్యానర్‌లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం గొప్ప అదృష్టం. హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన మనతోనే ఉంటారు’’ అని అన్నారు.  

వెంకట్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘నాన్న గారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. బాపూ గారు ఆ ఫోటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలు అన్నీ కలగలిపి ఉంటాయి. ఈ స్టాంప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. క్యాబినెట్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, చంద్రశేఖర్ ఇవాళ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. వారికి చాలా ధన్యవాదాలు'’ అని తెలిపారు. 

శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ..  ఈ గొప్ప  అవకాశం ఇచ్చిన నాగార్జునకి, అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ ఫెస్టివల్‌ని దేశంలోని 31 నగరాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నామని, ఇదొక హిస్టారికల్ డే అని పేర్కొన్నారు. ‘‘ఈ మూడు రోజుల్లో అక్కినేని నటించిన 10 క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ హెరిటేజ్‌ని కాపాడుకుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.

దర్శకుడు కే.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అక్కినేని, కోవెలమూడి కుటుంబాలు రెండు వేరువేరు కాదని అన్నారు. ‘‘నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్‌కి అన్నపూర్ణ స్టూడియోను తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. దేవదాస్, కాళిదాస్, విప్రనారాయణ ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. అలాంటి నటన, సినిమాలు మళ్లీ చూడగలమా అన్నంత గొప్పగా చేసిన ఘనత నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. తండ్రి కొడుకులతో సినిమాలు చేసే అదృష్టం నాకు దొరికింది. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా మనతోనే ఉంటారు’’ అని అన్నారు. 

జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ... ఇండియన్ సినిమా లెజెండ్ ఏఎన్నార్ శతజయంతి వేడుకలు సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘‘ఏఎన్నార్ గారు జనరేషన్స్‌కి స్ఫూర్తి. ఈ ఏడాది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏఎన్నార్ గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరపున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏఎన్నార్ దీవెనలు అందరిపై ఉంటాయి. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు’' అని అన్నారు. 

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... అక్కినేని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాగేశ్వరరావు గారు 1955లో లక్ష రూపాయిలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. అప్పుడు ఎకరం పొలం గుడివాడలో రూ.2 వేలు. అటువంటి రోజుల్లో ఆయన దగ్గర పాతిక వేలే ఉంటే 75 వేలు అప్పు తీసుకొని మొత్తం లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకొని ఊరిలో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం చేశారు. బుడమేరుపై వంతెన కట్టించిన ఘనత ఆయనది. తను చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. అక్కినేని గారు మహా మనిషి’’ అని కొనియాడారు.

కాగా ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్, సుమంత్, సుశాంత్, అమల అక్కినేని, నాగ సుశీల, సుప్రియా యార్లగడ్డతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.


More Telugu News