జగన్‌కు టీఎంసీ, క్యూసెక్కులకు తేడా తెలియదు: సోమిరెడ్డి

  • నీటి పారుదల వ్యవస్థపై జగన్‌కు కనీస అవగాహన లేదన్న సోమిరెడ్డి
  • అమరావతిపై కుట్ర పూరిత చర్యలు చేస్తున్నారంటూ సోమిరెడ్డి అగ్రహం
  • కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద వచ్చినా అమరావతి సురక్షితమన్న సోమిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయినా అమరావతిపై విషం కక్కడం మానడం లేదని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదికి ఇటీవల రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పక్కనే ఉన్న అమరావతికి ఎటువంటి ఇబ్బంది రాలేదన్నారు. చంద్రబాబు పాలనా దక్షతతో అమరావతికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునేందుకు జగన్ కుట్ర పూరిత చర్యలకు దిగుతున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పకృతి విపత్తులకు మహానగరాలే విలవిల్లాడుతున్నాయని అన్నారు. సముద్ర మట్టానికి 536 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ సహా సముద్రపు ఒడ్డున ఉన్న చెన్నై, ముంబయి నగరాలు కూడా వర్షాలకు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయాలను గుర్తు చేశారు. భారీ వరదలు వచ్చినా అమరావతి సురక్షితంగా ఉందన్నారు. సచివాలయం, హైకోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగాయని తెలిపారు. నీటి పారుదల వ్యవస్థపై జగన్‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. ఆయనకు టీఎంసీ, క్యూసెక్కులకు కూడా తేడా తెలియదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.


More Telugu News