విడదల రజని బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేశారు.. మాజీమంత్రిపై స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు

  • రజని, ఆమె మరిది గోపి, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఫిర్యాదు
  • తొలుత రూ. 5 కోట్లు అడిగారన్న చలపతి
  • ఆ తర్వాత గోపి, జాషువాకు చెరో రూ. 10 లక్షలు, రజనికి రూ. 2 కోట్లు ఇచ్చానని వెల్లడి 
  • విషయం బయటపెడితే ప్రాణహాని ఉంటుందని హెచ్చరించారన్న స్టోన్ క్రషర్ యజమాని
  • వారిపై చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకోలు
  • హోంమంత్రి అనితను కలిసి ఫిర్యాదు అందించిన చలపతి తరపు న్యాయవాది
మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని, ఆయన మరిది విడదల గోపి, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాపై శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపారి నల్లపనేని చలపతి హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నిన్న సచివాలయంలో మంత్రికి ఫిర్యాదు అందించారు. పైన పేర్కొన్న వారందరూ కలిసి తనను బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేశారని ఆ ఫిర్యాదులో చలపతి పేర్కొన్నారు.

రజనీ తన పీఏ రామకృష్ణ ద్వారా పిలిపించి వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారని, ఆ తర్వాత ఆమె పీఏ రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఆ ఫిర్యాదులో చలపతి పేర్కొన్నారు. ఆ తర్వాత జాషువా తనను కలిసి క్రషర్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, కాబట్టి రూ. 50 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని బెదిరించారని పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత ఫోన్ చేసి డబ్బుల సంగతి ఏం చేశావని ప్రశ్నించారని, రజని మరిదితో మాట్లాడుకోవాలని బెదిరించారని పేర్కొన్నారు. 

మార్చి 2021లో రజని మరిది కలిసి తనకు, జాషువాకు చెరో రూ. 10 లక్షలు, రజనీకి రూ. 2 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతో అంగీకరించామని, 4 మార్చి 2021న చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలోని ఇంటి వద్ద డబ్బులు అందించామని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని బయటపెడితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారాన్ని మూసివేయిస్తామని, ప్రాణహాని కూడా ఉంటుందని హెచ్చరించడంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కాబట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ నుంచి వారు వసూలు చేసిన డబ్బులు ఇప్పించడంతోపాటు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని చలపతి వేడుకున్నారు.


More Telugu News