శ‌త‌కంతో అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌.. క‌పిల్‌, ధోనీ రికార్డ్ స‌మం!

  • బంగ్లాపై అద్భుత‌మైన శ‌త‌కంతో రాణించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌
  • ఏడు లేదా అంత‌కంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన క‌పిల్‌, ధోనీ స‌ర‌స‌న అశ్విన్‌ 
  • ఈ ముగ్గురూ కూడా ఏడేసి శ‌త‌కాలు కొట్టిన వైనం
టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో మొద‌టి రోజు అజేయ‌ శ‌త‌కంతో మెరిశాడు. ఇది అశ్విన్‌కు టెస్టుల్లో ఏడో సెంచ‌రీ. త‌ద్వారా అత‌డు అరుదైన ఘ‌న‌త సాధించాడు. స్వ‌దేశంలో ఏడు లేదా అంత‌కంటే త‌క్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్య‌ధిక‌ సెంచ‌రీలు చేసిన భార‌త మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ స‌ర‌స‌న చేరాడు. వీరిద్ద‌రూ కూడా ఏడు శ‌త‌కాలే చేశారు. ఇప్పుడు అశ్విన్ కూడా ఏడో సెంచ‌రీ చేయ‌డంతో క‌పిల్‌, ధోనీ రికార్డు సమం అయింది. 

ఇక  144 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 6 వికెట్లు కోల్పోయి భార‌త జ‌ట్టు పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో అశ్విన్‌, జ‌డేజా ద్వ‌యం ఆదుకుంది. అశ్విన్ అజేయ శ‌త‌కం (112 బంతుల్లో 102 ప‌రుగులు)తో రాణిస్తే, జ‌డ్డూ (86 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్ప‌డం విశేషం. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భార‌త్‌ 339/6 వద్ద నిలిచింది. 

ఇక అశ్విన్ గురువారం చెపాక్ స్టేడియంలో చేసిన టెస్టు సెంచ‌రీ వ‌రుస‌గా రెండోది. ఇంత‌కుముందు 2021లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పై అత‌డు 148 బంతుల్లో 106 ప‌రుగులు చేశాడు. అలాగే  2011, 2013లో ముంబ‌యి, కోల్‌క‌తాలో వెస్టిండీస్‌పై కూడా అశ్విన్ వ‌రుస టెస్టు శ‌త‌కాలు బాదాడు.


More Telugu News