యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత... 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

  • స్వదేశంలో ఆడిన తొలి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే 750కి పైగా పరుగులు సాధించిన జైస్వాల్
  • ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా అవతరణ
  • బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు సాధించడంతో సొంతమైన రికార్డు
యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మరోసారి అదరగొట్టాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 56 పరుగులతో రాణించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం అద్భుతంగా రాణించాడు. పటిష్టంగా ఉన్న బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. విలువైన హాఫ్ సెంచరీ సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.

జైస్వాల్ స్వదేశంలో ఆడిన మొదటి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 755 పరుగులు బాదాడు. దీంతో 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడు స్వదేశంలో తొలి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 750 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే తొలిసారి. జైస్వాల్ కంటే ముందు 1935లో వెస్టిండీస్‌కు చెందిన జార్జ్ హెడ్లీ 747 పరుగులు సాధించాడు. ఆ రికార్డును ఇప్పుడు జైస్వాల్ బద్దలు కొట్టాడు.

స్వదేశంలో కెరీర్ తొలి 10 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే...
1. యశస్వి జైస్వాల్ - 755 (భారత్)
2. జార్జ్ హెడ్లీ - 747 (వెస్టిండీస్)
3. జావేద్ మియాందాద్ - 743 (పాకిస్థాన్)
4. డేవ్ హటన్ - 687 (జింబాబ్వే)
5. సర్ వివ్ రిచర్డ్స్- 680 (వెస్టిండీస్).


More Telugu News