ఏపీ హోంమంత్రి అనితను కలిసిన నటి కాదంబరి జెత్వానీ

  • విజయవాడ వచ్చిన జెత్వానీ
  • హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్న ముంబయి నటి
  • హోంమంత్రి నుంచి తనకు భరోసా లభించిందని వెల్లడి
ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఇవాళ విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితతో తన కష్టాలు చెప్పుకున్నానని జెత్వానీ వెల్లడించారు. గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించానని, కేసు విచారణ వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. 

విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని జెత్వానీ పేర్కొన్నారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. హోంమంత్రి తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. 

ఈ సందర్భంగా జెత్వానీ న్యాయవాది మాట్లాడుతూ, దేశంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవడం జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిందని, అది ఈ కేసు తీవ్రతకు నిదర్శనం అని వివరించారు. 

జెత్వానీ నుంచి తీసుకున్న ఐఫోన్లను కోర్టులో సమర్పించకుండా, ఆ ఫోన్లలోని డేటాను తెరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అవి ఐఫోన్లు కాబట్టి, వాటిలో అత్యంత భద్రత ప్రమాణాలు ఉంటాయి కాబట్టి సరిపోయిందని, మామూలు ఫోన్లు అయ్యుంటే ఈపాటికి ఓపెన్ చేసి ఉండేవాళ్లని తెలిపారు. ఐఫోన్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు జెత్వానీకి రెండు సార్లు అలర్ట్ మెసేజ్ లు వచ్చాయని, వాటిని సాక్ష్యాలుగా చూపిస్తామని పేర్కొన్నారు. 

జెత్వానీ సోదరుడిపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు వెనక్కి తీసుకున్నారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసును కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. 

ఈ కేసులో ఉన్న పెద్దలు ఎవరన్నది మీడియా ద్వారా ఇప్పటికే బయటికి వచ్చిందని, కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది కూడా మీడియా ద్వారా తేటతెల్లమైందని జెత్వానీ న్యాయవాది వివరించారు. ముంబయిలో కేసును మూసివేయడం కోసమే ఈ తతంగం అంతా జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.


More Telugu News