భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి మేం సిద్ధం.. చంద్రబాబు సిద్ధమా?: 'తిరుమల లడ్డు' వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి

  • తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు
  • తిరుమలను వైసీపీ అపవిత్రం చేసిందన్న సీఎం
  • రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్న సుబ్బారెడ్డి 
  • జులైలో నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై టీటీడీ వేటు
తిరుమల శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపేదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజకీయంగానూ చంద్రబాబు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌హాల్‌లో నిన్న ఎన్డీయే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని పేర్కొన్నారు. ప్రసాదంలో నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించిందని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలు శ్రీవారి భక్తులనే కాదు.. అందరినీ షాక్‌కు గురిచేశాయి. ‘‘వైసీపీ హయాంలో నాణ్యత లేని పదార్థాలను వాడడమే కాదు.. లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. ఇది తిరుమలను అపవిత్రం చేసింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని అన్నారు. ఈ ప్రపంచంలో పుట్టిన వారెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని, రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారని మరోమారు రుజవైందని మండిపడ్డారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా? అని సవాలు విసిరారు.

కాగా, ఈ ఏడాది జులైలో నాసిరకం నెయ్యిని సరఫరా చేసినందుకు ఓ కాంట్రాక్టర్‌ను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లిమిటెడ్ హై-గ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీనెయ్యిని సరఫరా చేసినట్టు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) నిర్ధారించింది.


More Telugu News