ఇండియాకు ఎందుకు వెళ్లిపోవడంలేదని అడిగితే ఎన్ఆర్ఐలు ఏమంటున్నారంటే...!

  • ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘రెడ్డిట్’ లో వైరల్ పోస్టు
  • ఆర్థిక ఎదుగుదల కోసమే అంటున్న చాలామంది ప్రవాసీలు
  • కెరీర్ పరమైన కారణాలని కామెంట్లు పెడుతున్న మరికొందరు
ఉన్నత విద్యాభ్యాసం కోసం, ఉద్యోగం కోసం ఏటా మన దేశం నుంచి వేలాది మంది విదేశాలకు వెళుతున్నారు.. అయితే, వారిలో తిరిగి వచ్చే వారి సంఖ్య మాత్రం వందల్లోనే ఉంటోంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉద్యోగం వెతుక్కుని అక్కడే స్థిరపడిపోతున్నారు. మాతృదేశంపై, పుట్టిపెరిగిన ప్రాంతంపై మమకారం చంపుకుని పరాయి దేశంలో జీవనం కొనసాగిస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్లు (ఎన్ఆర్ఐలు) గా మిగిలిపోతున్నారు. ఎందుకిలా..? అంటే సంపాదన కోసమేనని మనమంతా సింపుల్ గా చెప్పేస్తాం. 

అయితే, ఈ విషయంలో ఎన్ఆర్ఐలు ఎలా ఫీలవుతున్నారనే విషయంపై తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో చర్చ జరుగుతోంది. యూకేలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ఒకరు తన పోస్టులో ‘ఇండియాకు తిరిగి వెళ్లకుండా మిమ్మల్ని ఏం ఆపుతున్నది?’ అంటూ తోటి ఎన్ఆర్ఐలను ప్రశ్నించాడు. దీనికి చాలామంది ఎన్ఆర్ఐలు స్పందించి రకరకాల కారణాలు కామెంట్ల ద్వారా చెబుతున్నారు.

ఈ పోస్టుకు వచ్చిన కామెంట్లలో ఎక్కువ భాగం ఆర్థికపరమైన కారణాలే.. ఆర్థికంగా పైకి ఎదగడానికే అయినవాళ్లకు దూరంగా బతుకుతున్నామని చాలామంది వెల్లడించారు. ఇండియాలో నచ్చిన ఉద్యోగం దొరికే పరిస్థితిలేదని మరికొందరు, ఇక్కడున్న వసతులు మన దేశంలో లేవని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసమని మరికొందరు, నేరాలకు దూరంగా ప్రశాంతంగా, ధైర్యంగా బతకడం కోసమని ఇంకొందరు చెబుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, ఇండియన్లలో సివిక్ సెన్స్ తక్కువని, కాలుష్యంలేని వాతావరణం కోసమని, పరిశుభ్రమైన నీరు, ఆహారం, మన దగ్గరి నుంచి వసూలు చేసే పన్నులు మన కోసమే ఉపయోగపడతాయని.. ఇలా చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కొంతమంది మాత్రం ఇండియాలోని తమ బంధువులు, మన సంస్కృతి, సంప్రదాయాల కోసం, మాతృదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి తిరిగి వెళ్లిపోవాలని ఉందని అభిప్రాయపడ్డారు.


More Telugu News