కోహ్లీ గొప్ప టెస్ట్ కెప్టెన్ కావడానికి గంభీర్ చెప్పిన కారణం ఇదే

  • మీరు, మహీ భాయ్ యువ ఆటగాళ్లకు దారి ఇచ్చారన్న కోహ్లీ
  • విజయవంతమైన కెప్టెన్ కావడానికి ప్రణాళిక అవసరమైందన్న విరాట్
  • బౌలర్లను గుర్తించడమే విజయాలకు కారణమన్న గంభీర్
  • బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న ఇద్దరు స్టార్లు
భారత క్రికెట్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ స్టార్లు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ ఆటగాళ్లు ఒకప్పుడు టీమ్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కోచ్‌గా ఒకరు, ప్లేయర్‌గా మరొకరు డ్రెస్సింగ్‌ను పంచుకుంటున్నారు. దూకుడు స్వభావాన్ని కలిగి ఉండే వీరిద్దరూ ఒకప్పుడు మైదానంలోనే పరస్పరం ఘర్షణ పడడం అందరూ చూశారు. 

అయితే కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టాక ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ, గౌతీ మధ్య సఖ్యతను చాటి చెబుతూ బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సంభాషణలో వారిద్దరూ చక్కగా కూర్చొని మాట్లాడుకున్నారు.

టెస్ట్ క్రికెట్‌లో తన విజయవంతమైన ప్రయాణాన్ని కోహ్లీ వివరించాడు. ‘‘టెస్ట్ క్రికెట్‌పై నాకు ఆసక్తి పెరగడానికి కారణమైన విషయం సవాలు. విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌ కావడానికి ఉత్తేజ పరిచింది. మేము పరిణితి చెందుతున్న సమయంలో మీరు యువ ఆటగాళ్లకు దారి ఇచ్చారు. మహీ భాయ్ టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నాడు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. నాతో పాటు జట్టులో 24-25 ఏళ్ల యువ క్రికెటర్లే ఉన్నారు. మనమంతా ఎలా గుర్తింపు తెచ్చుకోగలం? అని కూర్చొని చర్చించుకునేవాళ్లం. విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కావడం యాదృచ్ఛికంగా జరగలేదు. నాకు నిజంగా ఒక ప్రణాళిక అవసరమైంది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

కోహ్లీకి సమాధానమిస్తూ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘మీరు ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నారో నేను అర్థం చేసుకోగలను. 24-25 ఏళ్ల కుర్రాడు టెస్ట్ కెప్టెన్సీ చేపట్టి అద్భుతంగా రాణించడానికి కారణంగా ఏంటంటే బలమైన బౌలింగ్ ఉండడమే. 20 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ మ్యాచ్‌లు గెలుస్తారు. ఇప్పటికైనా సరే బలమైన బౌలింగ్ లైనప్ లేకపోతే విజయాలు సాధించలేరు. ఆ బౌలింగే మిమ్మల్ని దేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌ని చేసింది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.

‘‘ ఆ ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే 6-7 బ్యాటర్లు వచ్చి సులభంగా మంచి స్కోర్ సాధిస్తారని ఒక బ్యాటర్‌గా భావించొచ్చు. కానీ మీరు ఫాస్ట్ బౌలర్లను గుర్తించిన విధానం బావుంది. షమీ, బుమ్రా, ఇషాంత్, ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్లు టీమ్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి’’ అని గంభీర్ ప్రస్తావించాడు. 

‘‘ఇక అడిలైడ్‌ టెస్టులో మీరు మంచి ఇన్నింగ్స్ ఆడినట్టు నాకు గుర్తుంది. అప్పుడు మనం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నాం. కెప్టెన్‌గా ఇది మీకు మొదటి మ్యాచ్ కావడంతో కచ్చితంగా గెలవాలని కోరుకున్నారు. అదే మనస్తత్వం, అదే సంస్కృతిని మనం తిరిగి తీసుకురావాలి’’ అని గంభీర్ పేర్కొన్నాడు.

కాగా 2014/15 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని అడిలైడ్ టెస్ట్‌కు బొటనవేలు గాయం కారణంగా ధోనీ దూరమవడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్ తర్వాత ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 

కోహ్లీ నాయకత్వంలో భారత్ మొత్తం 68 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా ఏకంగా 40 విజయాలు సాధించింది. 11 డ్రాలు, 17 ఓటములు ఉన్నాయి. దీంతో భారత అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతడి కెప్టెన్సీలో టెస్ట్ జట్టు గెలుపు 58.82 శాతంగా నమోదయింది.


More Telugu News