కడియపులంకలో డ్రోన్‌తో బాల గణేశ్ నిమజ్జన వేడుక .. సోషల్ మీడియాలో వైరల్
- కడియపులంకలో స్నానాల రేవుకు చిన్నారులను అనుమతించని అధికారులు
- డ్రోన్ తో బాల గణపతి నిమజ్జనం
- కేరింతలు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేసిన చిన్నారులు
డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. అనంతరం బాల గణపతిని స్థానిక స్నానాల రేవులో నిమజ్జనం చేయాలని భావించారు. అయితే స్నానాల రేవు వద్దకు పోలీసులు పిల్లలను అనుమతించకపోవడంతో వారు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. డ్రోన్ నిపుణుడి సాయాన్ని తీసుకున్నారు. బాల గణపతి విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాల గణపతి నిమజ్జనం హైలైట్ అయ్యింది.