చంద్రబాబు సర్కార్ కు 100 రోజులు.. నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ

  • ఈ నెల 20న 100 రోజులు పూర్తి చేసుకోనున్న కూటమి ప్రభుత్వం
  • కేబినెట్ భేటీలో 100 రోజుల పాలనపై చర్చించనున్న మంత్రివర్గం
  • ఆపరేషన్ బుడమేరు, కొత్త లిక్కర్ పాలసీపై చర్చించే అవకాశం
ఏపీలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. ఈ నెల 20న కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు తాము ఏం చేశామో ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక భేటీ జరగనుంది.

కేబినెట్ భేటీలో 100 రోజుల పాలనపై చర్చించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు వివిధ శాఖల వంద రోజుల ఫలితాలపై కూడా చర్చించనున్నారు. మంత్రుల పనితీరుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో కేబినెట్ మీటింగ్ లో మంత్రుల ప్రోగ్రెస్ ను వివరించడంతో పాటు... ఆయా శాఖల నివేదికలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.

ఆపరేషన్ బుడమేరు, విశాఖ స్టీల్ ప్లాంట్, కొత్త లిక్కర్ పాలసీ తదితర అంశాలపై కేబినెట్ భేటీలో లోతుగా చర్చించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.


More Telugu News