ఆ జీవోని ఆయన ముఖాన కట్టి రాష్ట్రమంతా తిప్పుతా: సీఎం చంద్రబాబు

  • రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై నిన్న జగన్ ట్వీట్
  • ఇవాళ చంద్రబాబును వివరణ కోరిన ఓ మీడియా ప్రతినిధి
  • పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దంటూ చంద్రబాబు వార్నింగ్
  • వీళ్లు చెల్లని కాసులు అంటూ విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ట్వీట్ పై ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయని, సీట్ల సంఖ్య తగ్గిపోతోందని జగన్ ఆరోపిస్తున్నారు... దీనికి మీరేమంటారు? అని ఆ రిపోర్టర్ చంద్రబాబును అడిగారు. 

అందుకు చంద్రబాబు స్పందిస్తూ... "ఆయనొక జీవో ఇచ్చాడు. ఆ జీవోను ఆయన ముఖానికి కట్టి రాష్ట్రమంతా తిప్పుతా. సూటిగా అడుతున్నా... ఏం అమలు చేశాడో ఆయనను చెప్పమనండి. ఆయన ఏ జీవో ఇచ్చాడో, ఆ జీవోను మీడియా ప్రతినిధులు కూడా చదివి తెలుసుకోవాలి.

ఇలాంటి నేరస్తులకు నేను చెప్పేది ఏంటంటే... బాబాయ్ ని చంపి నారాసుర రక్తచరిత్ర అని పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అనునిత్యం జరగవు అవన్నీ. తప్పుడు పనులన్నీ చేసి వేరేవాళ్లపై తోసేయాలని చూస్తే అవి జరగవు. ఆ రోజులు అయిపోయాయి. పిచ్చి పిచ్చిగా చేస్తే ఆ జీవోను చెవికి కట్టి చూపిస్తాను... ఊరంతా తిప్పుతా. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? 

నిన్న ఏం చేశారో మర్చిపోయి, దానిపై వాళ్లే ఇవాళ విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి మీరే చదవండి... నేను చెప్పను. చెబితే రహస్యం అందరికీ తెలిసిపోతుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఆయన ఏమని జీవో ఇచ్చాడో మీరే చదవాలి. వీళ్లు మాట్లాడే మాటలకు నేను ఇరిటేట్ కావాల్సిన పనిలేదు. ఇరిటేట్ అవ్వడం వల్ల వచ్చేదేమీ లేదు. వీళ్లు చెల్లని కాసులు! వీళ్లు ఇలాంటివే చేస్తారు. 

ప్రజల కోసం కొంతమంది పనిచేస్తుంటే, ప్రజలకు ద్రోహం చేసేందుకు మరికొంతమంది పనిచేస్తుంటారు. ఈ కలియుగంలోనే కాదు, ఇలాంటి వాళ్లు త్రేతాయుగం నుంచి ఉన్నారు. ద్వాపరయుగంలోనూ ఇలాంటి వాళ్లను చూశాం. అప్పట్లో రాజులు యజ్ఞాలు చేసేవాళ్లు... రాక్షసులు వచ్చి చెడగొట్టే వాళ్లు. ఇదొక నిరంతర ప్రక్రియ. మేం కూడా పోరాడుతూనే ఉంటాం" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News