త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం: నగర సీపీ సీవీ ఆనంద్

  • వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందన్న సీవీ ఆనంద్
  • మండపాల నిర్వాహకులతో మాట్లాడి వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడి
  • 25 వేల మంది పోలీసులు షిఫ్ట్‌ల వారీగా పని చేస్తున్నారన్న సీపీ
బాలాపూర్ వినాయకుడు సహా, అన్ని విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పలు ప్రాంతాల్లోని విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. మండపం నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామన్నారు. 25 వేల మంది పోలీసులు షిఫ్ట్‌ల వారీగా నగరంలో పని చేస్తున్నట్లు తెలిపారు. భాగ్యనగరంలో దాదాపు లక్ష విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారని, ఇందులో సగానికి పైగా నిమజ్జనం అయినట్లు తెలిపారు. మరో 20 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రేపు ఉదయం లోగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


More Telugu News