దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • పలు రాష్ట్రాల్లో నేరస్తులు, సంఘ వ్యతిరేక శక్తుల ఇళ్ల కూల్చివేత
  • బుల్డోజర్ న్యాయం పేరిట చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు
  • విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
  • అక్టోబరు 1 వరకు బుల్డోజర్ చర్యలు వద్దన్న అత్యున్నత న్యాయస్థానం
దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా బుల్డోజర్ చర్యలు వద్దని స్పష్టం చేసింది. అక్టోబరు 1 వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అయితే, ఫుట్ పాత్ లు, రహదారుల ఆక్రమణలు, రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సంఘ వ్యతిరేక శక్తులు, నేరగాళ్ల ఇళ్లను ప్రభుత్వాలు బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా జమాత్ ఉలేమా హింద్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. 

కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా కూల్చినట్టయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కూల్చివేతలు ఆపేస్తే, ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

'బుల్డోజర్ న్యాయం' పేరిట చర్యలు చేపట్టడం హీరోయిజం అనిపించుకోదని, అక్టోబరు 1 వరకు కూల్చివేతలు ఆపినంత మాత్రాన కొంపలు మునిగిపోయే పరిస్థితులు ఏర్పడవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది.


More Telugu News