చాలా గ్యాప్ తర్వాత ఆ ఆటగాడికి చోటు ఖరారు!.. కెప్టెన్ రోహిత్ సంకేతాలు

  • కేఎల్ రాహుల్ టాలెంట్ ఉన్న ఆటగాడన్న కెప్టెన్
  • టెస్టు ఫార్మాట్‌లో రాహుల్ రాణిస్తాడని ఆశాభావం
  • బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు
గురువారం నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో చోటు దక్కించుకోనున్న ఆటగాళ్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్‌ను హిట్‌మ్యాన్ వెనుకేసుకొచ్చాడు.  

సమీప భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ రాణిస్తాడని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాహుల్ ఎంత నాణ్యమైన ఆటగాడో అందరికీ తెలుసని, అతడిలో ప్రతిభ ఉందని వ్యాఖ్యానించాడు. రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో తాము ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. 

రాహుల్ దక్షిణాఫ్రికా టూర్‌లో సెంచరీ సాధించాడని, ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో 80 ప్లస్ పరుగులు సాధించాడని, అయితే దురదృష్టవశాత్తు గాయపడ్డాడని రోహిత్ ప్రస్తావించాడు. కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్‌లో బాగా ఆడాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు.

కేఎల్ రాహుల్ తిరిగి పుంజుకుంటాడని తాను నమ్ముతున్నానని, అతడు టెస్ట్ క్రికెట్‌లో రాణించలేకపోవడానికి కారణాలేమీ తనకు కనిపించడం లేదని రోహిత్ పేర్కొన్నాడు. 

ఇక బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌పై మాట్లాడుతూ... ప్రతి సిరీస్ ముఖ్యమైనదేనని అన్నాడు. ఒక సిరీస్ గెలుచుకున్నాం కాబట్టి ఆ తర్వాత సిరీస్‌పై దృష్టి పెట్టకపోవడం ఉండదని స్పష్టం చేశాడు. ఆడే ప్రతి సిరీస్‌ను గెలవాలని భావిస్తామని, ఇటీవల పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చారిత్రాత్మకమైన విజయం సాధించిన నేపథ్యంలో ఆ జట్టును తేలికగా తీసుకోబోమని వివరించాడు.

ఇటీవల అంతగా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌‌లో చోటు కోల్పోయాడు. అంతేకాదు ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. 

ఇక టెస్ట్ జట్టులో అతడికి ఇబ్బందికర పరిస్థితులు నెలకున్నాయి. రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడం, ఇంగ్లండ్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో టెస్ట్ ఫార్మాట్‌లో అతడి స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌లో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఆడాడు. గాయపడడంతో మిగతా నాలుగు టెస్టులకు అతడు దూరమైన విషయం తెలిసిందే.


More Telugu News