ఇలాంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు: ఏపీ మంత్రి సత్యకుమార్

  • ఏపీలో నూతన మద్యం విధానం
  • అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
  • నేడు మీడియా ముందుకు వచ్చిన మంత్రి వర్గ ఉపసంఘం
నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం, నేడు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. 

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. అన్ని వ్యవస్థలను కూడా దోచుకుని, చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే విధానానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు... అవేవో శక్తులు ఉన్నవాళ్లకే ఇలాంటి ఆలోచనలు వస్తాయని వ్యాఖ్యానించారు

మద్యం విధానాన్ని జేబులు నింపుకోవడానికే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కంటే అధికంగా మద్యం ధరలు పెంచేశారని తెలిపారు. ముఖ్యంగా... గత ప్రభుత్వం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ను తీసుకువచ్చి, మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద రూ.13 వేల కోట్ల అప్పు తీసుకువచ్చిందని మంత్రి సత్యకుమార్ వివరించారు. 

"గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై పడింది. ఓవైపు ఆ రూ.13 వేల కోట్ల అప్పు చెల్లించాలి, మరోవైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకే సరఫరా చేయడం, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం వంటి బాధ్యతలు కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేయడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలి. అందుకే అనేక రాష్ట్రాల్లో ఎలాంటి మద్యం విధానాలు ఉన్నాయో అధ్యయనం చేశాం. ఆ మేరకు నూతన మద్యం విధానం తీసుకువచ్చాం" అని మంత్రి సత్యకుమార్ వివరించారు.


More Telugu News