ఏపీలో మ‌రో ప్ర‌భుత్వ ప‌థ‌కం పేరు మార్పు

  • ఇప్ప‌టికే ప‌లు ప‌థ‌కాల పేర్ల‌ను మార్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం 
  • తాజాగా 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ ప‌థ‌కం' పేరు మార్పు
  • 'ఏపీ రీ స‌ర్వే ప్రాజెక్టు'గా మారుస్తూ రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు 
ఏపీలో ఇంత‌కుముందు వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ప‌లు ప‌థ‌కాల పేర్ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మార్చిన విష‌యం తెలిసిందే. ఇదే కోవ‌లో ఇప్పుడు మ‌రో ప‌థ‌కం పేరును మార్చింది. జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేసిన 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ' ప‌థ‌కం పేరును 'ఏపీ రీ స‌ర్వే ప్రాజెక్టు'గా మార్పు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజాగా రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

కాగా, ఈ స్కీమ్ ను గ్రామాల్లో భూవివాదాలు, త‌గాదాలు లేకుండా చేయాల‌నే ఉద్దేశంతో తీసుకువ‌చ్చామని అప్పట్లో జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా భూముల స‌మ‌గ్ర రీ స‌ర్వే చేప‌ట్టారు. కానీ, ఈ ప‌థ‌కం ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ' ప‌థ‌కంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఈ నేప‌థ్యంలో, ఈ స్కీమ్ అమలు తీరును అప్ప‌టి ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వ‌స్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయ‌డం జ‌రుగుతుంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ ప‌థ‌కం' పేరును మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.


More Telugu News