కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి అవకతవకల్లో టీఎంసీ నేత హస్తం?

  • ఎమ్మెల్యే సుదీప్త రాయ్ ఆఫీసు, ఆయనకు చెందిన ఆసుపత్రిలో ఈడీ సోదాలు
  • జ్యుడీషియల్ కస్టడీలో ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్
  • ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ అధికారుల తనిఖీలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో అవకతవకలకు సంబంధించి పలు కొత్త పేర్లు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను అదుపులోకి తీసుకుంది.

 నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్‌ ఘోష్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే, రాష్ట్ర హెల్త్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ సుదీప్త రాయ్ పాత్ర కూడా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుదీప్త రాయ్ ఇల్లు, ఆఫీసు, ఆయనకు చెందిన నర్సింగ్ హోంతో పాటు మొత్తంగా నాలుగు చోట్ల ఈడీ అధికారులు మంగళవారం సోదాలు చేస్తున్నారు.

మరోవైపు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ కేసుల్లో తమ పార్టీ నాయకులను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల సూచనల మేరకే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నాయని మండిపడుతున్నారు.


More Telugu News