సీఎం మమతా బెనర్జీ ఆఖరి ప్రయత్నం సఫలం... చర్చలకు వైద్యుల అంగీకారం

  • సీఎం మమతా బెనర్జీ 5వ ప్రయత్నంలో చర్చలకు సమ్మతం తెలిపిన వైద్యులు
  • పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలని డిమాండ్
  • సీఎస్ పంపిన మెయిల్‌కు స్పందించిన వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా కొన్ని వారాలుగా ఆందోళన చేపడుతున్న వైద్యులు ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. 

ఆఖరి ప్రయత్నంగా 5వ సారి విజ్ఞప్తి చేయగా చర్చలకు వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ సుముఖత వ్యక్తం చేసింది. హత్యాచారం కేసులో సీబీఐ తాజా అరెస్టులతో సాక్ష్యాల ట్యాంపరింగ్‌ను ఎత్తిచూపుతోందని, అందుకే చర్చలలో పారదర్శకత అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు రావాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ ఈ-మెయిల్ పంపించారు. దక్షిణ కోల్‌కతాలో కాళీఘాట్‌లో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి రావాలని ఆహ్వానించారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే వేదిక ఏదైనా అధికారిక లేదా పరిపాలనా ప్రదేశం అయితే బాగుంటుందని వైద్యులు సూచించారు. చర్చలు పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.

హత్యాచారం ఘటనలో సాక్షాల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఆరోపణలు వస్తుండడం, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ అభిజిత్ మోండల్‌ను కూడా అరెస్టు చేసిన నేపథ్యంలో చర్చలు మరింత పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు. చర్చలను కెమెరాలతో పూర్తిగా చిత్రీకరించాలని కోరారు. వీడియోగ్రఫీ చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. 

కాగా చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ అంతకుముందు కోరినప్పటికీ..  ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున అది సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వైద్యులు వెనక్కి తగ్గారు. ఇరు పక్షాలకు చెందిన వేర్వేరు వీడియోగ్రాఫర్లతో వీడియో రికార్డింగ్ చేయకపోయినా ఫర్వాలేదు...  సమావేశం ముగిసిన వెంటనే జూనియర్ డాక్టర్లకు ప్రొసీడింగ్‌ల వీడియోను ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు అనుమతి తర్వాతే వీడియోలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. 

అంతేకాదు చర్చలకు వచ్చిన వారందరూ మినిట్స్ బుక్‌లో సంతకాలు చేయాలని కూడా వైద్యులు కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కాగా చర్చలకు అంగీకరించినప్పటికీ చర్చల షెడ్యూల్, ప్రభుత్వం తరపున ఎవరెవరు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది.


More Telugu News