అభిమానుల కళ్లు భానుప్రియ కోసం వెదుకుతూనే ఉన్నాయ్!

  • 1980లలో దూసుకొచ్చిన భానుప్రియ 
  • డాన్సులలో ఆమెకి ఆమెనే సాటి
  • కేరక్టర్ ఆర్టిస్టుగాను మెరిసిన భానుప్రియ 
  • మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి 
  • ఈ మధ్య కాలంలో కనిపించని నటి  

 భానుప్రియ 1980 - 90లలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి. ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్న కథానాయిక. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలోని ప్రేక్షకులను అలరించిన అభినయ సారిక. సితార .. అన్వేషణ .. ఖైదీ నెంబర్ 786 .. స్వర్ణకమలం .. ఇలా ఎన్నో భారీ హిట్లను ఆమె సొంతం చేసుకున్నారు. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేశారు. 

అప్పట్లో మెగాస్టార్ తో కలిసి డాన్సులతో మెప్పించిన కథానాయికలలో విజయశాంతి .. రాధ .. భానుప్రియ కనిపిస్తారు. సంప్రదాయ బద్ధమైన నాట్యానికి సంబంధించిన పాత్రలలో భానుప్రియ మాత్రమే కనిపించేవారు. అదే ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవాలి.  స్వర్ణ కమలం సినిమా చూస్తే తెరపై భానుప్రియ నాట్యం చేస్తుందా? ప్రవహిస్తుందా? అనేది అర్థం కాదు. అంత వేగం చూపించిన నాయిక ఆమె. 

అలాంటి భానుప్రియ ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలలో కనిపించారు. ఆ తరువాత ఏ ప్రాజెక్టులలో కనిపించడం లేదు. భర్త మరణం తరువాత ఆమె కుంగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. తాను మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టుగా ఆ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఆ తరువాత భానుప్రియ గురించి ఏమీ తెలియడం లేదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలనే కోరికతో అభిమానులు ఉన్నారు. త్వరలోనే ఆ ముచ్చట తీరాలని కోరుకుందాం. 



More Telugu News