రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం

  • రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల నిబంధనలు మార్చాలని సూచన
  • కొత్తగా జారీ చేయబోయే కార్డుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకు రావాలన్న ఎంపీ
  • ఆదాయ, భూపరిమితిని ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా సవరించాలన్న అసదుద్దీన్
తెలంగాణలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించి నిబంధనలు మార్చాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి ఆయన వినతిపత్రాన్ని అందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కొత్తగా జారీ చేయబోయే కార్డుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకు రావాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5.67 లక్షల నిరుపేద కుటుంబాలు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని, భూపరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. అలాగే, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్నయోజన కార్డులను ఇవ్వాలని సూచించారు.


More Telugu News