గోల్ఫ్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు

  • ప్రచారం ముగించుకొని తన గోల్ఫ్ కోర్టుకు వచ్చిన ట్రంప్
  • గోల్ఫ్ ఆడుతున్న సమయంలో తుపాకీతో సంచరించిన అనుమానిత వ్యక్తి
  • నిందితుడి పైకి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పులు
  • పారిపోతున్న నిందితుడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లో ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు... అతని పైకి కాల్పులు జరిపారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. తుపాకీతో సంచరించిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన క్యాంపెయిన్ నేతలు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్రంప్‌ను చంపడానికి రెండు నెలల కాలంలోనే దుష్టశక్తులు రెండుసార్లు ప్రయత్నించాయని ట్రంప్ రాజకీయ ప్రచార సలహాదారులు మండిపడ్డారు. అదృష్టవశాత్తూ గోల్ఫ్ కోర్టులో ఎవరూ గాయపడలేదని, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అద్భుత పనితీరుతో ట్రంప్‌తో పాటు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.

ట్రంప్ నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్నారు. గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఒక వ్యక్తి ఆయుధంతో సంచరించాడని, ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేశారని అధికారులు తెలిపారు. అనుమానితుడిని గుర్తించిన సీక్రెట్ ఏజెంట్లు అతని పైకి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి ఎస్‌యూవీలో పారిపోవడంతో... పోలీసులు వెంబడించి పట్టుకున్నారని తెలిపారు.


More Telugu News