కేరళలో ఘనంగా 'ఓనం' సంబరాలు

  • నేడు (సెప్టెంబరు 15) ఓనం పండుగ
  • కేరళలో ఇంటింటా పండుగ శోభ
  • కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులు
కేరళలో సంప్రదాయ పండుగ ఓనంను నేడు (సెప్టెంబరు 15) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కొత్త బట్టలు ధరించి, రకరకాల పిండివంటలతో సంబరాలు చేసుకున్నారు. పిల్లలు, పెద్దలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.

జన్మతః రాక్షస రాజు అయినప్పటికీ, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన 'మహాబలి' (బలి చక్రవర్తి) తిరిగి వచ్చే రోజు ఓనం లేదా తిరువోనం అని కేరళ ప్రజలు నమ్ముతారు. ఓనం రోజున మహిళలు 'కసవు' చీరలు, పురుషులు 'ముండు'(ధోతీ) ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. తమ ఇళ్లను పూలతో అందంగా అలంకరిస్తారు. 

ఓనం నాడు గురువాయూర్ లోని శ్రీకృష్ణ ఆలయం, శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. తమ ఇళ్లలో ఉయ్యాల ఊగుతూ పండుగ క్షణాలను ఆస్వాదిస్తారు. 

కాగా, ఇటీవలి వరదల్లో వందలాది మంది చనిపోయిన నేపథ్యంలో, ఓనం పండుగ సంబరాలను అధికారికంగా నిర్వహించబోవడంలేదని కేరళ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. 

ఓనం పండుగ సందర్భంగా కేరళీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News